*ఏదో తెలియని రోగం తో సుమారు 10000వేల కోళ్లు మృతి*
జిల్లా పౌల్ట్రీ రైతులను వణికిస్తున్న అంతుచిక్కని వైరస్
పెద్దకొత్తపల్లి, నాగర్‌కర్నూల్ మండలాల్లో తీవ్రంగా నష్టపోయిన రైతులు
విచారణ కోసం రంగంలోకి దిగనున్న ఫోరెన్సిక్ నిపుణుల బృందం
నాగర్‌కర్నూల్ జిల్లాలోని పౌల్ట్రీ రైతులు అంతుచిక్కని వైరస్ దెబ్బకు బెంబేలెత్తిపోతున్నారు. జిల్లావ్యాప్తంగా ఒకే రోజులో సుమారు 10 వేల కోళ్లు మృత్యువాత పడటం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ పరిణామంతో పెట్టుబడులు పెట్టిన చిన్న, సన్నకారు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్దకొత్తపల్లి మండలం చిన్నపురావుపల్లిలో ఉన్న ఓ ఫారంలో ఏకంగా 5 వేల కోళ్లు చనిపోయాయి. అలాగే నాగర్‌కర్నూల్ మండలంలోని రాంరెడ్డిపల్లి తండాలో 1,500 కోళ్లు, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో మరో 4 వేల వరకు కోళ్లు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామంతో ఏం చేయాలో తెలియక రైతులు లబోదిబోమంటున్నారు.
కోళ్ల మృతికి కారణమైన వైరస్‌ను గుర్తించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సోమవారం ఫోరెన్సిక్ నిపుణుల బృందం నాగర్‌కర్నూల్‌కు రానుంది.
